ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే చిక్కుడు డా.వంశీకృష్ణ

ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటి సౌభాగ్యమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే చిక్కుడు డా. చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, అమ్రాబాద్, మాధవానిపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ భవనం, బస్తీ దవాఖానా భవనాలకు భూమి పూజ నిర్వహించారు. మహిళా సమాఖ్య కార్యాలయాన్ని విజిట్ చేశారు. అనంతరం మన్ననూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ప్రజా పాలనలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు ఇప్పటికే నెరవేరాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నినాదాలు నీళ్ళు, నిధులు, నియామకాలు అనే అంశాలపై సిఎం రేవంత్ రెడ్డి కృషి సాగిస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించి రాష్ట్రానికి భారీగా నిధులు సమకూరుస్తున్నారన్నారు. ఏడాదికి 50 వేల ఉద్యోగాల కల్పన కోసం జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేయడమే కాక ఇప్పటికే పలు శాఖల్లో 52 వేల ఉద్యోగ నియామకాలు జరిగాయన్నారు. ప్రజా సంక్షేమంలో భాగంగా అర్హులైన అందరికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నియోజక వర్గంలోని 8 మండలాలలో గ్రామ సభలు విజయవంతం అయ్యాయని ఆయన అన్నారు. ఇందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పంచాయితీ రాజ్ శాఖా నుండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎం ఆర్ఆర్ నిధుల నుండి 20 కోట్ల రూ. మంజూరు అయ్యాయన్నారు. ఇప్పటికే ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధుల నుండి రూ. 27.5 కోట్లతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు.

సుమారు రూ. 273 కోట్ల నిధులతో నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో బిటి రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లి దేశంలోనే నెంబర్ 1 గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజక వర్గ ప్రజల తరుపున ఆయన సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు హరినారాయణ గౌడ్, నర్సింహ, బాలింగయ్య గౌడ్, వెంకటయ్య, శ్రీనివాస్, రవి, రాజు, తుల్చ, యశ్వంత్, శివ, తదితరులు పాల్గొన్నారు.